AP Cabinet: ఈ నెల 7వ తేదీన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ బేటీ జరగనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 3వ తేదీన కేబినెట్ బేటీ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ ఇటీవల అకాల మృతి చెందిన మంత్రి గౌతమ్ రెడ్డి వైదిక కార్యక్రమాల కారణంగా 7వ తేదీకి వాయిదా వేశారు. 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
AP Cabinet: వికేంద్రీకరణ బిల్లు పై ఎలా ముందుకు వెళ్లాలి..?
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రాజధాని అభివృద్ధి చేయాలని, రాజధానిలోని ప్రధాన కార్యాలయాలు తరలించడానికి వీలులేదంటూనే గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజధాని వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే న్యాయపరమైన చిక్కులు రాకుండా మెరుగైన విధంగా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం యోచన చేసింది. అయితే రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏమి చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే దానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా..? కొత్త గా బిల్లు తీసుకురావాలా..? వద్దా.. మూడు రాజధానులపై కేంద్రం ఆమోదానికి ప్రతిపాదనలు పంపాలా..? ఇలా అన్ని రకాలుగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.
AP Cabinet: జిల్లాల పునర్విభజన అంశంపైనా
రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి నిరసనలు, విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రం, డివిజన్ ల ఏర్పాట్లలో తమకు అన్యాయం జరిగిందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారితో పాటు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల నుండి అభ్యంతరాలను స్వీకరించింది. ఈ జిల్లాల పునర్విభజన అంశంపైనా పూర్తి స్థాయిలో కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రెండు ప్రధాన అంశాలతో పాటు బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.