Breaking: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జి రాఘంపేట అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలైయ్యారు. గురువారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తొంది. పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్ ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ట్యాంకర్ లో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఇవేళ ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులకు ఊపిరి అందలేదు. వెంటనే కార్మికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో ఊపిరి ఆడక ఎడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

లోపలికి దిగిన కార్మికులు ఎంతకు బయటకు రాకపోవడంతో మిగిలిన కార్మికులు వెళ్లి చూడగా వారు విగతజీవులుగా కనిపించారు. దీంతో వెంటనే ట్యాంకర్ ను యంత్రాలతో కూల్చి వారిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే వారు ఊరిపి ఆడక చనిపోయినట్లు గుర్తించారు. మృతులు పాడేరుకు చెందిన మొచ్చంగి కృష్ణా, మొచ్చంగి నరసింగా, మొచ్చంగి సాగర్, కురతాడు బంజు బాబు, కుర్ర రామారావు, పులిమేరు గ్రామానికి చెందిన కట్టమురి జగదీష్, ప్రసాద్ గా గుర్తించారు. వీరి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో కర్మాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
