విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ – 2 లిక్విడ్ విభాగంలో పేలుడు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో నలుగురు రెగ్యులర్ కార్మికులు కాగా, అయిదుగురు ఒప్పంద కార్మికులు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. ప్లాగ్ యాష్ ను తొలగించే క్రమంలో నీళ్లు పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన వారికి ప్రధమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరుకి స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో శ్రీను, బంగారయ్య, అనిల్ బిశ్వాల్, సూరిబాబు, జై కుమార్ పోతయ్య, ఈశ్వర్ నాయుడు, అప్పలరాజు, సాహు ఉన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై విచారణ జరిపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు కోరారు.