బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. ఇప్పుడు తాజాగా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యత రెడ్డి తో పాటు భర్త భార్గవ రామ్ కుటుంబ సభ్యులు నిందితులుగా మారారు. కిడ్నాప్ పథక రచన నుండి నిందితులు పారి పోయే వరకు భార్గవ రామ్ కుటుంబ సభ్యులు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ, జగత్ విఖ్యాత రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.జగత్ విఖ్యాత రెడ్డి కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారంతో విఖ్యాత రెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ పూటేజీ, కాల్ డేటా ఆధారంగా అతని పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరో వైపు భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ తో పాటు భార్గవ్ రామ్ సోదరి సహకారం కూడా తీస్తున్నారని పోలీస్ విచారణలో వెల్లడి అవుతుంది. ఈ కేసులో బాధితులు తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు కావడంతో పోలీసులు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. దీనితో అఖిల ప్రియ, భార్గవ్ రామ్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచ్చు బిగుసుకుంటోంది.
మరోపక్క అఖిల ప్రియ కస్టడియల్ విచారణ ముగిసింది. దీంతో ఆమెను న్యాయమూర్తి ముందు హాజరు పరిచి, అనంతరం జుడిషియల్ రిమాండ్ కై చంచల్ గూడా జైలుకు పంపించారు. అంతకు ముందు అఖిల ప్రియ కం బోయినపల్లి పీహెచ్సీలో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. తదుపరి గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అఖిల ప్రియ తరఫున న్యాయవాదులు నేడు బెయిల్ పిటిషన్ వేయగా సోమవారం కు వాయిదా వేశారు.