Amaravati Land scam: అమరావతి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ అంశంపై లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు దర్మాసనం పేర్కొంది. ఏపి హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ వినిత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, మెహపూజ్ నజ్కి, ప్రతివాదుల తరపున పరాస్ కుహాడ్, శ్యామ్ దివాన్, సిద్ధార్ధ లూధ్రా వాదనలు వినిపించారు.

అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేపట్టవద్దని, ప్రాధమిక దశలో ఉన్న విచారణను హైకోర్టు అడ్డుకుందని ఏపి ప్రభుత్వ తరపు న్యాయవాది దవే ధర్మాసనంకు వివరించారు. ఈ అంశంపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఆ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. భూముల క్రయ విక్రయాల్లో అనేక లోపాలు ఉన్నాయనీ, ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టానికి అనుగుణంగా దీనిపై విచారణ జరగాల్సి ఉందని దవే వాదించారు. 2014 నుండి 2019 వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదనీ, 2019 లో ప్రభుత్వం మారిన తరువాతే ఫిర్యాదులు అందినట్లు దవే ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వ వాదనలతో ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతి భూ క్రయవిక్రయాల్లో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని న్యాయవాది పరాస్ కుహాడ్ తెలిపారు. ఏ ఒక్కరూ విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. మరో ప్రతివాది తరపున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..గతంలో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
అమరావతి రాజధాని భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకూ ఆరోపించిన ప్రభుత్వం ఈ తీర్పు నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.