Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలి ఊరట తీర్పు వచ్చింది. ఒక కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు గత 34 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన తర్వాత చంద్రబాబుకు సంబందించి ఇతర కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్ల ఘటన కేసులో చంద్రబాబు బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ లు తిరస్కరణకు గురైయ్యాయి. ఈ కేసుల్లో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. ఈ పిటిషన్ ఇవేళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 17వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఇవేళ విచారణ జరగనుంది. ఇప్పటికే రెండు రోజుల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సిద్దార్థ లూథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇవేళ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.
ఈ తరుణంలో అంగళ్లు ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ పై హైకోర్టులో ఇవేళ తీర్పు వెలువడింది. చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తు, రెండు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా చిత్తూరు జిల్లా అంగళ్లు వద్ద చోటుచేసుకున్న ఘటనలో టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై పోలీసులు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల తో ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి చెందిన వారే చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు విసిరారని తెలిపారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబుకు రక్షణ గా నిలిచిందని వివరించారు. అందుకు సంబంధించిన వీడియోలను కోర్టుకు అందజేశారు.
వైసీపీకి చెందిన వారు దాడులకు పాల్పడి నాలుగు రోజుల ఆలస్యంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. జాప్యానికి కారణాలు చెప్పలేదన్నారు. సాగునిట ప్రాజెక్టుల సందర్శనకు పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీ నిర్వహించారన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పలువురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు కూడా ఆ ఉత్తర్వులను సమర్ధించిందన్నారు. పిటిషనర్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పోలీసుల తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
పిటిషనర్ ప్రోద్భలంతోనే దాడి ఘటన చోటు చేసుకుందన్నారు. పిటిషనర్, ఆయన అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిటిషనర్ చెప్పాకే దాడులు జరిగాయని, పోలీసులకు గాయాలు అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ ప్రతీకారంతో కేసు పెట్టామనడంలో వాస్తవం లేదని పేర్కొంటూ ఘర్షణకు సంబంధించి వీడియోలను అందజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ వేళ తీర్పు వెల్లడించింది.
YS Jagan: సీఎం జగన్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ