AP Appulu: ఆంధ్రప్రదేశ్ కు అప్పులు ఎంత ఉన్నాయి..? అనే దానిపై అనేక లెక్కలు వస్తున్నాయి. మొన్న పార్లమెంట్ లో చెప్పిన లెక్క ఒకటి, వైసీపీ వాళ్లు చెబుతున్నది మరొకటి, నిన్న చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పిన మరొకటిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఎంత ఉన్నాయి..? అనే అంశంపై కాగ్ (సీఏజి) వెబ్ సైట్, గతంలో ప్రభుత్వం విడుదల చేసిన వివరాలు, ఇతరత్రా సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో 2009 లో ఎంత అప్పు ఉంది..? 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు హయాంలో చేసిన అప్పు ఎంత.,? వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అప్ప వివరాలను న్యూస్ ఆర్బిట్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

AP Appulu: రాష్ట్ర విభజన నాటికి అప్పు రూ.1,04,409 కోట్లు
*2009 మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి 76.536 కోట్ల అప్పు ఉంది. అప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి రూ.25,565 కోట్లు అప్పు తీసుకువచ్చారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తరువాత 2014 రాష్ట్ర విభజన వరకూ కూడా ఆయన రూ.45,949 కోట్లతో పాటు కార్పోరేషన్ ల పేరిట రూ.31,153 కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రం అప్పు రూ.1,79,203 కోట్లు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్ర అప్పులను 58..42 నిష్పత్తిలో పంచగా ఆంధ్రప్రదేశ్ కు అప్పు రూ.1,04,409 కోట్లు (2014 జూన్ నాటికి)గా ఉంది.
చంద్రబాబు హయాంలో 2,10,086 కోట్లు
రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 2014 నుండి 2019 వరకూ రూ.1,53,713 కోట్లతో పాటు వివిధ కార్పోరేషన్ ల ద్వారా రూ.31,373 కోట్లు అప్పు చేశారు. అంతే కాకుండా చంద్రబాబు దిగిపోయే నాటికి కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు 25వేల కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం లెక్కేసుకుంటే 2,10,086 కోట్లుగా చంద్రబాబు హయాంలో చేసిన అప్పుగా ఉంది. దీంతో పాటు రాష్ట్ర విభజన హయాం నాటికి ఏపి వాటాగా ఉన్న అప్పు రూ.1,04,409 కోట్లు కలుపుకుంటే 2019 ఏప్రిల్ 1 నాటికి ఏపికి మొత్తం రూ.3,14,495 కోట్ల అప్పు (వైఎస్ జగన్ సిఎం అయ్యేనాటికి) ఉంది.
జగన్మోహనరెడ్డి హాయంలో 3,08,104 కోట్లు.
జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2019 జూన్ నుండి 2021 నవంబర్ వరకూ (2021 డిసెంబర్, 2022 జనవరి అప్పుల లెక్క రాలేదు) రూ.1,49,342 కోట్ల అప్పు చేశారు. అలాగే వివిధ కార్పోరేషన్ల ద్వారా రూ.71,761 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి లో కార్పోరేషన్ ల ద్వారా రూ.31,153 కోట్లు అప్పు, చంద్రబాబు హయాంలో కార్పోరేషన్ ద్వారా రూ.31,373 కోట్లు అప్పు చేస్తే జగన్మోహనరెడ్డి హాయంలో రెండున్నర సంవత్సరాల కాలంలోనే కార్పోరేషన్ ల ద్వారా ఏకంగా రూ.71,761 కోట్లు అప్పు చేసింది. వీటితో పాటు పాతవి కొత్తవి బిల్లు బకాయిలు రూ.75,000 కోట్లు అప్పులు ఉన్నాయి. వీటన్నింటికి వడ్డీలు రూ.12వేల కోట్లు. జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత రెండున్నరేళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం 3,08,104 కోట్లు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్లలో చేసిన అప్పు రూ.2,10,086 కోట్లు. 2014 వరకూ మన రాష్ట్రానికి ఉన్న అప్పు రూ.1,04,409 కోట్లు. మొత్తంగా ఏపికి ఉన్న అప్పు రూ.6,22,599 కోట్లు ఉంది. ఈ అప్పు నవంబర్ ఒకటి 2021 నాటి వరకూ. 2021 డిసెంబర్, జనవరి 2022 నెలల్లో మరో రూ.30వేల కోట్లు అప్పు చేసినట్లు అంచనా. ప్రస్తుతానికి మన రాష్ట్రానికి రూ.6,50,00 కోట్లు అప్పు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు.