Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్టు బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే వైసీపీ సర్కార్ చేసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలక్షన్ ఇయర్ లో 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉండి, 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది అంటే కేంద్ర పెద్దలకు తెలియకుండా జరిగి ఉండేది కాదని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఆదివారం మీడియా సమావేశంలో ఆ ప్రచారాన్ని ఖండించడంతో పాటు టీడీపీతో పొత్తు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు.చంద్రబాబు అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీయే తొలుత తప్పుబట్టిందని, అరెస్టును ఖండిస్తున్నామని తామే ముందుగా ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు పురందరేశ్వరి. సీఐడీ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని ఆమె స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారని పురందరేశ్వరి తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదని అన్నారు దగ్గుబాటి పురందరేశ్వరి. బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారన్నారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర పరిస్థితులను పవన్ కళ్యాణ్ తీసుకువెళతామని చెప్పారనీ, దీనిపై పార్టీ అధిష్టానం పెద్దలు మాతో చర్చలు చేసిన సమయంలో తమ అభిప్రాయాలను చెబుతామన్నారు పురందరేశ్వరి.
రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ లో చంద్రబాబును నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కలిసి పరామర్శించడం, ఆ తర్వాత బయటకు వచ్చిన వెంటనే రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో జనసేన పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. తమ కూటమితో బీజేపీ కలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలోని పరిస్థితులను బీజేపీ కేంద్ర పెద్దలకు తెలియజేస్తానని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ .. ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరపకుండా టీడీపీతో పొత్తుపై నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి స్పందించారు.
Amit Shah: నిజాంపై అలుపెరగని పోరాటం దేశ భక్తికి నిదర్శనం .. అమరవీరులకు నివాళులర్పించిన అమిత్ షా