AP BJP: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఏపి బీజేపీ అధ్యక్ష పదవి నుండి సోమును తొలగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.. సోము వీర్రాజు పదవీ కాలం పూర్తి కావడంతో ఆయనను రాజీనామా చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఫోన్ చేసి చెప్పినట్లుగా తెలుస్తొంది. మరో ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఏడాది లో ఏపి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పునకు కేంద్రం దృష్టి పెట్టింది. అటు తెలంగాణలో బండి సంజయ్, ఇటు ఏపిలో సోము వీర్రాజు నాయకత్వాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇరువుని మార్పు చేయాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది. అయితే పార్టీ బలోపేతానికి బండి సంజయ్ చేసిన కృషికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది.

ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను తప్పిస్తున్నట్లు జేపీ నడ్డా స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే సత్యకుమార్ నియామకంపై కొందరు వ్యతిరేకిస్తున్నారనని తెలుస్తొంది. ఒక వేళ బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయితే సత్యకుమార్ కే అవకాశం లభిస్తుందని అంటున్నారు. ఒక వేళ సత్యకుమార్ కాకపోతే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికి మాత్రం పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా, సత్యకుమార్ ను నియమిస్తారా లేక సుజానా చౌదరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనేది తేలాలి అంటే ఒకటి రెండు రోజుల్లో తేలనున్నది.