CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 20వ తేదీ కేబినెట్ భేటీ జరగనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాలులో మంత్రివర్గ సమావేశం జరగనున్నది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం అవుతుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అలానే ఈ నెల 21వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిపికేషన్ ఇచ్చారు.

21వ తేదీ ఉదయం 9 గంటలకు 11వ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు జీవో నెం.25ను గవర్నర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు నుండి ఏపీ శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తరపున ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో నెం. 24 జారీ చేశారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై మొదటి రోజు శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయ్యింది. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు అధికారికంగా ప్రకటించాయి. మరో పక్క కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సిద్దమైంది. జమిలి ఎన్నికలు.. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ పార్లమెంట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రం లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరపాలని నిర్ణయించినా వాటితో పాటుగాన ఏపీలో ఎన్నికలు జరగనున్నాయనే మాట వినబడుతోంది.
వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఏపీలో షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నా, లోక్ సభ ఎన్నికల నిర్వహణ లో నిర్ణయం మారితే దానికి అనుగుణంగా ఏపీలోనూ ఎన్నికల నిర్వహణ మారే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా 20వ తేదీ న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.