మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసు దర్యాప్తలో ఏపి సీఐడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో రామోజీరావు కుమార్తె, మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఏ 3 కి సిబ్బందిని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు అందుబాటులో ఉండాలని కోరుతూ సీఐడీ డీఎస్పీ రవి కుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ.

ఈ నెల 29 లేదా 31 తేదీల్లో లేదంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఇల్లు లేదంటే ఆఫీసులో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో మార్గదర్శి మేనేజర్ లను సీఐడీ అరెస్టు చేసిన నేపథ్యంలో మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టు హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ల తరపు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టు లాంటి బలవంతపు చర్యల నుండి మినహాయింపు ఇచ్చింది.