ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకూ మన ప్రభుత్వంపై నేడు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లు పాల్గొననున్నారు. గత ఏడాది మే నెల నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలైంది. రెండు మూడు నెలలకు ఒక సారి సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం అమలుపై వివిధ రకాల సర్వే రిపోర్టుల ఆధారంగా నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న సీఎం జగన్..పలు మార్లు వీక్ గా ఉన్న వారిని సున్నితంగా మందలించారు. పనితీరు మెరుగుపర్చుకుంటేనే రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని కరాఖండిగా చెప్పేశారు. పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామనీ, మొహమాటాలకు తావు లేదని కూడా స్పష్టం చేశారు సీఎం జగన్. మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క భవిష్యత్తుకు భరోసా పేరుతో టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. మరో పక్క నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవేళ జరిగే సమీక్షా సమావేశంలో సీఎం జగన్ పనితీరు మెరుగుపర్చుకోని ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు, ప్రతిపక్ష పార్టీ విమర్శలకు ధీటుగా సమాధానాలు ఇవ్వని నేతలకు గట్టిగా క్లాస్ పీకే అవకాశం ఉందని సమాచారం. పలు నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాల కారణంగా పార్టీ నష్టపోయే పరిస్థితి నెలకొంది. దీంతో సీఎం జగన్ ఎవరెవరికి తలంటుతారో అన్న భయం కొందరు నేతల్లో నెలకొంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బలమైన గ్రూపులు తయారై టికెట్ లు ఆశిస్తున్నారు. ప్రధానంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ప్రొగ్రెస్ రిపోర్టుతో వారికి క్లాస్ పీకే అవకాశం ఉందని అంటున్నారు.
TDP Internal: టీడీపీలో చంద్రబాబుకు తాజా తలనొప్పులు.. పలువురు సీనియర్ నేతలు రివర్స్..?