ఎన్ఐఏ కోర్టుకు వ్యక్తిగత హజరు నుండి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మినహాయింపు కోరారు. కోడి కత్తి కేసులో సాక్షిగా, బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా హజరు కావాలని గత వాయిదా సందర్భంలో మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవేళ విచారణకు గానూ సీఎం జగన్ కోర్టుకు హజరు అవుతారా లేదా అన్న సందేహం మధ్య సీఎం జగన్ వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ దరఖాస్తు చేశారు. సీఎంగా అత్యవసర విధులు నిర్వహించాల్సి ఉందనీ, అలాగే భద్రతాపరమైన కారణాలను ఆయన కోర్టుకు తెలియజేశారు.

2018 అక్టోబర్ లో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జే శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేయడం, దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితుడిగానే కాక సాక్షి గా ఉన్న జగన్ కూడా సోమవారం (ఏప్రిల్ 10) హజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలనీ, అడ్వొకేట్ కమిషనర్ ద్వారా సాక్షం నమోదు చేయాలని కోర్టును కోరారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.