శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నకు పోటీ అభ్యర్ధిని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇవేళ పరోక్షంగా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో జరిగిన బహిరంగ సభలో టెక్కలి అభ్యర్ధిని ప్రకటించారు సీఎం జగన్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపనున్నట్లు తెలిపారు. శ్రీనును, మీ చేతుల్లో పెడుతున్నా, అందరూ ఆశీర్వదించాలని జగన్ కోరారు. టెక్కలి నియోజకవర్గంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని చెబుతున్నానన్నారు. ఇదే సందర్భంలో దువ్వాడ శ్రీను కోరికపై సంతబొమ్మాళి మండలంలోని గ్రామాలకు తాగు నీరు అందించేందుకు రూ.70 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. టెక్కలి నియోజకవర్గ ప్రజలు శ్రీనును ఆశీర్వదించాలని జగన్ కోరడంతో వచ్చే ఎన్నికలకు దువ్వాడ అభ్యర్ధిత్వం ఖరారు చేసినట్లుగా జగన్ చెప్పకనే చెప్పారు.

టెక్కలి వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హవాను దెబ్బకొట్టేందుకే దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారనే టాక్ ఉంది. దానికి తోడు 2021 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అయితే దువ్వాడ ఎమ్మెల్యే పదవీ కాలం 2027 వరకూ మార్చి వరకూ ఉండటంతో గత ఎన్నికల్లో పోటీ చేసి అచ్చెన్నాయుడుపై పరాజయం పాలైన పేరాడ తిలక్ మరల పోటీ చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో దువ్వాడ, పేరాడ వర్గాలతో పాటు మరో వైపు కిల్లి కృపారాణి వర్గం కూడా ఉంది. ఈ తరుణంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు జగన్ ముందుగానే దువ్వాడ అభ్యర్ధిత్వాన్ని పరోక్షంగా ప్రకటించేశారు.
దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2001 లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, ఆ తర్వాత 2006 లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో టెక్కలి నుండి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి అచ్చెన్నాయుడుపై 8,387 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి 6,653 ఓట్ల తేడాతో ఓటమిపాలైయ్యారు. ఒక సారి అసెంబ్లీ, మరో సారి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలైన దువ్వాడకు 2021 లో సీఎం జగన్ ఎమ్మెల్సీ ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నాయుడుపై గెలవాలన్న పట్టుదలతో దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు.
Big Breaking: సీఎం జగన్ కీలక ప్రకటన.. విశాఖ నుండి పరిపాలన కు ముహూర్తం ఖరారు