ఏపిలో విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ .. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాధమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టడంతో పాటు బై లింగ్యువల్ (ద్వి భాషా) పాఠ్యపుస్తకాలను అందిస్తూ విద్యార్ధులకు అత్యున్నత బోధనలు అందిస్తున్నారు. విద్యార్ధులను ఆత్మ విశ్వాసంతో తీర్చిదిద్దే పోటీ పరీక్షల్లో రాణించేలా చిన్న నాటి నుండే టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యూజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్) పరీక్షకు సిద్దం చేయాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు అత్యుత్తమ ఆంగ్ల నైపుణ్యాలు, సామర్థ్యాలు అలవడేలా తగిన శిక్షణ ఇచ్చి టోఫెల్ పరీక్షలకు సిద్దం చేయాలని చెప్పారు. మూడు నుండి అయిదువ తరగతి విద్యార్థులకు ప్రైమరీ స్థాయిలో, ఆరు నుండి 9 తరగతుల వారికి జూనియర్ స్థాయిలో టోఫెల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్ లు అందించనున్నారు.

ప్రైమరీ స్థాయిలో వినడం, చదవడంలో నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది, జూనియర్ స్థాయిలో వీటికి అదనంగా మాట్లాడటంలో నైపుణ్యాలను కూడా పరీక్షిస్తారు. ఈ పరీక్షల కోసం విద్యార్ధులు, ఉపాధ్యాయులను సన్నద్దం చేసేలా ఇ – కంటెంట్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. విద్యార్ధుల చదువులకు అన్ని దశల్లో అండగా ఉంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్య మొదలు కొని ఉన్నత విద్య వరకూ ఎక్కడా చదువులు ఆర్ధికంగా భారం కాకుండా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తొందని సీఎం జగన్ చెప్పారు. ఏ ఒక్క విద్యార్ధీ, ఏ కారణంతోనూ చదువులకు దూరం కాకుండా, డ్రాపౌట్లు అనే ప్రసక్తి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో క్షేత్ర స్థాయిలో విద్యాశాఖను సమన్వయం చేశామని చెప్పారు.
ఒక వేళ ఎవరైనా విద్యార్ధులు గైర్హజరైతే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు వారితో మాట్లాడి పాఠశాలకు పంపేలా పటిష్ఠ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. పిల్లలు పాఠశాలకు గైర్హజరైతే తల్లిదండ్రులకు వెంటనే మెసేజ్ వెళుతోందనీ, దీని వల్ల తమ పిల్లలు సక్రమంగా స్కూళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోగలుగుతున్నారు. అదే విధంగా అమ్మఒడి పథకాన్ని ఇంటర్ వరకూ వర్తింపజేశామనీ, ఆ తర్వాత ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్ధులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ నాటికి నాడు – నేడు తొలి దశ పూర్తైన స్కూళ్లలో తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు.
CM YS Jagan: ఈ నెల 21న లండన్ కు సీఎం జగన్..?