ఏపిలో పలు నిబంధనల పేరుతో భారీగా సామాజిక పెన్షన్లను తొలగిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. పెన్షన్ల తొలగింపుపై ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో కథనాలు రావడం, వి పక్షాలు విమర్శలు చేస్తుండంతో ఏపి సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. పెన్షన్ల పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో లబ్దిపొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు.

ఈ సందర్భంలో సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒక సారి పెన్షన్ లపై ఆడిట్ జరగాలనీ, ఆడిట్ జరుగుతుంటే పెన్షన్ లు తీసివేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు నోటీసులు ఇచ్చి రీ వెరిఫికేషన్ మాత్రమే చేస్తారనీ, అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటూనే తప్పుడు ప్రచారాలను కలెక్టర్ లు తిప్పికొట్టాలని సీఎం జగన్ కీలక సూచన చేశారు.
తప్పుడు ప్రచారాలను ఖండించకపోతే ప్రజల్లోకి తప్పుడు మెసేజ్ వెళుతుందన్నారు. మన వైపు తప్పులేకపోతే ప్రతి కలెక్టర్ కూడా ప్రెస్ కాన్పిరెన్స్ లు పెట్టి తిట్టే కార్యక్రమం చేయాలన్నారు. అలా తిట్టకపోతే రాంగ్ మేసేజ్ పోతుందన్నారు. ఇదే సందర్భంలో గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి ఇప్పుడు జరుగుతున్న పెన్షన్ల పంపిణీకి తేడాను వివరించారు. విషపు ప్రచారాలను చేసే వారిని దేవుడే శిక్షిస్తారు అంటూ శాపనార్ధాలు పెట్టారు.