AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ మరో సారి ఢిల్లీ పయనవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ఈ పర్యటనలో భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి ఢిల్లీకి బయలుదేరతారు సీఎం జగన్. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నెలలో సీఎం జగన్ ఢిల్లీ వెల్లడం ఇది రెండో సారి. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లి.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఆ మేరకు వినతి పత్రాలను సమర్పించారు. అయితే.. రెండు వారాల వ్యవధిలో సీఎం జగన్ మళ్లీ ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళుతుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని అంటున్నారు. ప్రధానంగా రాజధాని అంశంలో వైసీపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపి హైకోర్టు తీర్పుపై స్టే వస్తుంది ఆ వెంటనే పరిపాలనా రాజధానిగా విశాఖను చేసి అక్కడ నుండి పాలన ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. ఇటీవల రెండు మూడు సందర్భాల్లోనూ ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే అమరావతి అంశం ఇప్పట్లో తెమిలేలా కనబడం లేదు. అమరావతి కేసును జూలై 11వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే విశాఖ పరిపాలనా కేంద్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసానికి ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రధానంగా ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు తీరును తప్పుబడుతున్నారు. దర్యాప్తు అధికారిపైనా ఆరోపణలు చేశారు. వాస్తవానికి దగ్గరగా కాకుండా వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ వ్యవహారంపైనా చర్చించే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. వీటితో పాటు మరో ప్రధాన అంశం పోలవరం ప్రాజెక్టు విషయంలో సవరించిన అంచనాలపై కేంద్రం నుండి స్పష్టత ఇవ్వకపోవడం, పోలవరం ఎత్తుపై కేంద్రం ఇటీవల చేసిన కీలక ప్రకటనపైనా చర్చించే అవకాశం ఉంది. ఏది ఏమైనా రెండు వారాల వ్యవధిలో రెండో సారి ప్రధాన మంత్రి మోడీని కలిసేందుకు సీఎం జగన్ వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చంద్రబాబు – జగన్ కు మధ్య తేడా ఇదీ .. ఇందుకు దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..!