ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి ప్రవేశపెట్టారు. సాధారణంగా ప్రజలు వివిధ సేవలను ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పొందుతుంటారు. పలు పనుల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా గతంలో ఉండేది. ప్రజలకు ఆ పరిస్థితి లేకుండా నేరుగా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించేందుకు గానూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. రేపటి నుండి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం కానున్నది. జగనన్న సురక్ష యాప్ ను సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించడంతో ఈ కార్యక్రమం మొదలు అవుతుంది. జూన్ 23 నుండి జూలై 23 వరకూ అంటే నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో పట్టణ, గ్రామ వాలంటీర్లు, గృహ సారధులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటారు. “జగనన్నకు చెబుదాం” కు అనుబంధంగా అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ సమస్యలను మండల, పురపాలక స్థాయిల్లోని అధికారిక బృందాలు పరిష్కరిస్తాయి. జిల్లా కలెక్టర్ లు, ఇతర ప్రభుత్వ బృందాలు వారానికి ఒక సారి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి పరిష్కరించని ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జూలై ఒటవ తేదీ నుండి అన్ని గ్రామ, వార్డు సచివాలాయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక క్యాంపులో ప్రధానంగా 11 రకాల సేవలు, దృవీకరణ పత్రాలు జారీకి ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయరు.
ప్రజల వద్దకే ప్రభుత్వం
వాలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది, గృహ సారధులు ఈ నెల 24వ తేదీ నుండే ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి అవగాహన కల్పిస్తారు. 1.6 కోట్ల కుటుంబాల వద్దకే అధికారులు వెల్లనున్నారు. 15వేల సచివాలయాల్లో సురక్ష క్యాంపులు నిర్వహిస్తారు. ముందుగా గుర్తించబడిన పత్రాలకు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రతి సచివాలయంలో ఒక రోజు క్యాంపును నిర్వహిస్తారు. నూరు శాతం అర్హులను ప్రభుత్వ పథకాల్లో చేర్చడం, పత్రాల సమస్యలను పరిష్కారం, పౌరుల సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 30 రోజుల్లో 5.3 కోట్ల పౌరులకు చేరువ అయ్యేలా 15 వేల సురక్షా క్యాంపులు నిర్వహిస్తారు. 1.5 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 3వేల మంది మండల అధికారులు, 26 మంది ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. 2.6లక్షల మంది వాలంటీర్లు, 7.5 లక్షల మంది గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు కోటి 60 లక్షల కుటుంబాలను సందర్శిస్తారు. ముందుగా మండల అధికారులచే వాలంటీర్లు, గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు .. క్యాంపు గురించి మరియు షెడ్యుల్ గురించి శిక్షణ పొందుతారు.
క్యాంపు నిర్వహణకు ముందుగా వాలంటీర్లు, గృహ సారధులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ పథకాలు, పత్రాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కావాల్సిన పత్రాలను అప్పుడే సేకరిస్తారు. అనంతరం క్యాంపు నందు మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో క రోజు ఉండి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించి, సేవా చార్జీలు లేకుండానే పత్రాలను అందిస్తారు. సురక్ష క్యాంపులో మండల స్థాయి అధికారులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు క్యాంపులను సందర్శంచి మీడియా సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సందర్శనలో వాలంటీర్లు.. ప్రభుత్వం పది ప్రశ్నలతో ఇచ్చిన ప్రశ్నావళి మరియు సర్వే పత్రాన్ని ప్రజలకు వివరించి వారి వద్ద నుండి సమాధానాలు స్వీకరించాలి. అనంతరం వారికి పాకెట్ క్యాలెండర్ ను అందించి సదరు వ్యక్తి ఫోటోను వాలంటీర్ యాప్ లో అప్ లోడ్ చేయాలి. ప్రజల నుండి పథకాలకు, లేదా పత్రాలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వారి నుండి సంబంధిత పత్రాలను సేకరించిన తర్వాత టోకెన్ నెంబర్ ను అందించాలని అధికారులు తెలిపారు.
సర్వీసు చార్జీలు లేకుండా అందజేసే సేవలు ఇవే
- కుల ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
- జనన ధృవీకరణ పత్రం
- వివాహ ధృవీకరణ పత్రం
- కుటుంబ ధృవీకరణ పత్రం
- మరణ ధృవీకరణ పత్రం
- కొత్త/ బియ్యం కార్డు విభజన
- హౌస్ హోల్డ్ స్ల్పిట్టింగ్
- లావాదేవీ మ్యుటేషన్లు
- ఫోన్ నంబర్ కు ఆధార్ అనుసంధానం
- పంట సాగు హక్కు కార్డు
పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ లో చేరికకు మూహూర్తం ఫిక్స్ .. ఎప్పుడంటే..?