ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు మంత్రులకు చెప్పేశారు. త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇటీవల జగన్ చెప్పిన విషయం తెలిసిందే. త్వరలోనే విశాఖ ఏపి రాజదానిగా మారబోతుందని, సీఎంఓ కూడా విశాఖలోనే ఉండబోతున్నట్లు జగన్ గతంలోనే తెలిపారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోనూ సీఎం జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే రాజధాని అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున ముందుగా సీఎం క్యాంప్ ఆఫీసును ఫిఫ్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే జులైలో విశాఖకు షిప్ట్ అవుతానని ఇప్పుడు జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

అలానే త్వరలో జరగనున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ గెలవాల్సిందేనని సీఎం జగన్ మంత్రులకు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలను గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని జగన్ అన్నారు. ఏ తేడా వచ్చినా మంత్రివర్గంలో మార్పులు తప్పవని హెచ్చరించారు. దీంతో పాటు కొందరు మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని కూడా సూచించారుట. లేకుంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మార్పులు తప్పవని, ఎన్నికల సమయంలో నిర్లక్ష్యం వహించిన మంత్రులపై వేటు తప్పదని జగన్ హెచ్చరించారని తెలిసింది. ఎమ్మెల్యేలను మంత్రులు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని జగన్ ఆదేశించారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూసుకుంటే ఆరు వైసీపీ, ఒకటి టీడీపీ ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. అయితే టీడీపీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా మారడంతో వైసీపీ ఏడుగురు అభ్యర్ధులను బరిలోకి దింపింది. టీడీపీకి సంఖ్యాపరంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారిలో నలుగురు వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాలి గిరిథర్, వాసుపల్లి గణేష్ లు టీడీపీకి దూరమైయ్యారు. నైతికంగా బలం లేకపోవడం వల్ల టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టదని భావించారు. అయితే అనూహ్యంగా టీడీపీ నుండి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గద్దె అనురాధ బరిలో దిగడంతో పోటీ రసవత్తరం అయ్యింది. టీడీపీ విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణరెడ్డిలు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఆరు ఓట్లు కీలకం అవుతున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో.
YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్టు .. ఎందుకంటే..?