ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మొన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ .. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, పెండింగ్ సమస్యలపై చర్చించి వినతి పత్రాన్ని అందించారు. ఈ రోజు ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ఏపి అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై అమిత్ షాకు విన్నవించారు సీఎం జగన్. ప్రధానంగా తిరుపతిలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటు అవశ్యకతను వివరించారు. యూనివర్శిటీకి ఏర్పాటునకు అవసరమైన భూమిని ప్రభుత్వం ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలియజేస్తూ యూనివర్శిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అమిత్ షాను కోరారు.

అదే విధంగా రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడుస్తున్నా విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు ఇప్పటికీ నెరవేరలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని హోంమంత్రికి వివరించారు. కేంద్రం నుండి రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయనీ, వాటిని వెంటనే మంజూరు చేయాలని అమిత్ షా ను సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్లను రెండేళ్లుగా చెల్లించలేదనీ, ఈ డబ్బులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ డిస్కమ్ ల నుండి రావాల్సిన బకాయిలు ఇప్పించాలనీ, జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్దంగా లేవనీ, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. అదే ప్రత్యేక హోదా, మెడికల్ కళాశాలల మంజూరు, కడప లో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు ఏపీెండీసీ గనుల కేటాయింపు, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నకు పర్యావరణ అనుమతులు ఇలా పలు కీలక అంశాలను అమిత్ షాకు వివరించారు సీఎం జగన్. అమిత్ షోతో సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో గన్నవరంకు వచ్చారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్నారు.