ఏపిలో మూడు రాజధానులపై మరో మారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొన్న దిగ్గజ వ్యాపార వేత్తలు, వేలాది మంది అతిధుల సమక్షంలో పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేశారు సీఎం జగన్. ఇంతకు ముందు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలనే మరో మారు విశాఖ సాగర తీరం సాక్షిగా కూడా చేశారు జగన్. జనవరి 31న ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో విశాఖనే రాజధాని అంటూ జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

సీఎం జగన్ ప్రకటన చేసిన వెంటనే అధికారులు కూడా విశాఖలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి పెట్టారు. కాపులుప్పాడ ఐటీ పార్క్ లో భవనాలు కూడా సిద్దం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. విశాఖ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందనీ, నూతన విద్యాసంవత్సరం నాటికి విశాఖ ఎగ్జికూటివ్ క్యాపిటల్ గా కార్యకలాపాలు మొదలు అవుతాయని ప్రకటించారు మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమరనాథ్.
మరో పక్క మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ పరిధిలో ఉంది. అమరావతి కేసులో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ (ఎస్ఎల్పీ)పై ఈ నెల 28న విచారణకు రానున్నది. అయితే ముందస్తుగానే విచారణకు తీసుకోవాలని ఏపి సర్కార్ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసినా ముందుగా ఖరారు చేసిన తేదీనే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే వస్తే ఆ వెంటనే అసంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టి మూడు రాజధానులపై ముందుకు వెళ్లవచ్చు అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
గత ఎన్నికలు నేర్పిన పాఠం .. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన..విపక్షాలకు బిగ్ షాక్