అనకాపల్లి జిల్లా యలమంచికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ .. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు (85) భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తులసీరావు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి స్వగ్రామానికి తరలించగా, గురువారం సీఎం వైఎస్ జగన్ యలమంచిలి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమరనాథ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. అడారి తులసీరావు గత మూడు దశాబ్దాలుగా విశాఖ డెయిరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తుండగా, కుమార్తె రమా కుమారి యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.