YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించారు. కొవ్వూరు వేదికగా జరిగిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి – ఫిబ్రవరి – మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులు రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకూ రూ.10, 636 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలు సామాజికంగా ఎదగాలన్నా, వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదువు అన్నదే గొప్ప అస్త్రం అన్నారు సీఎం జగన్.

జీవితంలో ఉన్నత స్థాయికి వెళలాలంటే విద్యాతోనే సాధ్యమన్నారు. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు. ఒక సత్య నాదెళ్ల గురించి మాట్లాడుకోవడం కాదనీ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుండి ఒక సత్యా నాదెళ్ల రావాలన్నారు. ప్రతిభ చూపించే ప్రతి విద్యార్దికి తోడుగా ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదే సందర్బంలో మరో సారి ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియాపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. నాడు రాష్ట్రంలో ఇదే జనాభా, ఇదే బడ్జెట్, ముఖ్యమంత్రి ఒక్కరే మారారు. ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలను అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడి దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ఆ ముఠాలో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లకు తోడు దత్తపుత్రుడు ఉన్నారని అన్నారు. ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయని మరో సారి ఘాటుగా వ్యాఖ్యనించారు. పేద వాడికి, పెత్తందార్లకు మద్య క్లాస్ వార్ జరుగుతోందని అన్నారు. ప్రజలు మీ ఇంట్లో మేలు జరిగిందనే కొలమానంతోనే నాకు మద్దతు ఇవ్వండని కోరారు జగన్.