ఏపిలో పలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. అయితే కొందరు రాజీనామాలు చేయడం, తదితరత్రా కారణాల రీత్యా గ్రామ, వార్డు సచివాలయాల్లో కొన్ని పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలపై నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం వైెఎస్ జగన్. పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పుల కోసం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

గతంలో నియామక ప్రక్రియ ను అత్యంత పారదర్శకంగా చేపట్టారన్న పేరు వచ్చిందనీ, మళ్లీ ఎలాంటి లోటు పాట్లు లేకుండా సమర్ధవంతంగా వీటి నియామక ప్రక్రియ ను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది పై విభాగాల వారిగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై చాలా స్పష్టత ఉండాలని సీఎం జగన్ తెలిపారు. విధులు, బాధ్యతలపై ఎస్ఓపీలు ఉండాలన్నారు. వాటిని సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజల ధరఖాస్తుల పరిష్కారం చాలా ముఖ్యమైనదనీ, వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలన్నారు. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి ఆ అర్జీని పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ శాఖాధికారులు ప్రతి నెల రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని చెప్పారు.
ప్రతి ప్రభుత్వ విభాగాల్లోనూ ఫేషియల్ రికగ్రైజేషన్ కూడిన హజరు ను అమలు చేయాలని అదేశించారు. ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలు అయితే కింది స్థాయి లో కూడా అందరూ అమలు చేస్తారని అన్నారు. దీని వల్ల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలకు సంబంధించిన పరిష్కారంపై దృష్టి పెడతారని తెలిపారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర సచివాలయం నుండి గ్రామ స్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ హజరు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే విధంగా అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వైర్ లెస్ ఇంటర్నెట్ తో నడుస్తున్న 2909 గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేయాలని చెప్పారు. గ్రామాల్లోని ఆర్బీకే లు, విలేజ్ సెక్రటరియట్స్ లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. అంగన్ వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.