అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు. చేతికొచ్చిన పంట వర్షం కారణంగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎంవో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంలో ఆకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాధమిక సమాచారాన్ని సీఎంకు అందించారు.

పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలు పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్ పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్యుమరేషన్ పూర్తి అయిన తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురియడంత రైతులకు భారీగా పంట నష్టం జరిగింది. ఇవేళ కూడా ఏపిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయనీ, పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.