YS Jagan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం వైఎస్ జగన్. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తదుపరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్ల కాదు.. ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు.
రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారమని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామనీ, 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చినట్లు చెప్పారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో 35 కు పైగా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పని చేస్తొందన్నారు.
ఇదే సందర్భంలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని విమర్శించారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు జగన్. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లాలని విమర్శించారు. చంద్రబాబు, ఆయనను సమర్ధించే నాయకులెవరూ ఏపీలో ఉండరని జగన్ అన్నారు. చంద్రబాబు నెల రోజుల పాటు మన రాష్ట్రంలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో నెల రోజులుగా ఉన్నారన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, దత్తపుత్రుడు, ఈ గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన రామోజీరావు, రాధాకృష్ణ, నాయుడు వీళ్లెవ్వరూ మన రాష్ట్రంలో ఉండరు. ఆంధ్రరాష్ట్రం, ఈ ప్రజలు వాళ్లకు ఎందుకు కావాలి అంటే ఇక్కడ దోచుకోవడానికి, అక్కడ హైదరాబాద్ లో పంచుకోవడానికి కావాలి. అని జగన్ విమర్శించారు.
దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని విమర్శించారు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదనీ. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం మాత్రమేనన్నారు. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుని హైదరాబాద్‌లో పంచుకుంటారని విమర్శించారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు ప్యాకేజీ స్టార్ వస్తుంటాడు అని విమర్శించారు. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకేనే ఓ వ్యాపారి పవన్ అంటూ ఘాటు విమర్శలు చేశారు జగన్. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా కాపులు అని కూడా అనలేరని అన్నారు.
ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదని జగన్ అన్నారు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలన్నారు. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారని అన్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారన్నారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయాలంటే విలువ, విశ్వసనీయత ఉండాలని అన్నారు. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలని, కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు అని జగన్ అన్నారు.