CM YS Jagan: ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో పండుగగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా దుష్ట శక్తులు ప్రయత్నాలు చేశాయనీ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దంటూ మారీచులు, రాక్షసులు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. పేదల కోసం సుప్రీం లో న్యాయపోరాటం చేసి విజయం సాధించామని అన్నారు. వైసీపీ హయాంలో అమరావతి ఇక పై సామాజిక అమరావతి అవుతుందని పేర్కొన్నారు సీఎం జగన్. ఈ అమరావతి మన అందరి అమరావతి అవుతుందని గర్వపడుతున్నానని అన్నారు.

25 లే అవుట్ లలో 50, 793 మంది లబ్దిదారులకు ఏడు నుండి పది లక్షల రూపాయల విలువ చేసే ఇళ్ల స్థలాలను అందజేస్తున్నామన్నారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టించే కార్యక్రమం కూడా చేపడతాని హామీ ఇచ్చారు. ఈ ఇళ్ల పట్టాల పండుగ వారం రోజుల పాటు జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్ లు ఉంటాయనీ జగన్ చెప్పారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే లక్షా 80వేల రూపాయలు లబ్దిదారుల ఖాతాలో వేస్తామన్నారు. రెండో ఆప్షన్ లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. స్టీల్, సిమెంట్, డోర్ ఫ్రేమ్ లు సబ్సిడీపై అందిస్తామన్నారు. మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఇళ్ల స్థలాలతో పాటు అయిదు వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదనీ, ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేసారన్నారు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని, వాళ్లను నమ్మవద్దని అన్నారు. నరకాసురుడినైనా నమ్మోచ్చు కానీ నారా చంద్రబాబు నాయుడిని మాత్రం నమ్మకూడదు అని ప్రజలకు సూచించారు సీఎం జగన్. ఈ ప్రభుత్వం హయాంలో ప్రజలకు జరిగిన మంచిని వివరించడంతో పాటు చంద్రబాబు, ప్రతిపక్షాలపై మరో సారి ధ్వజమెత్తారు.