ఏపిలోని పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత ఆర్ధిక సాయాన్ని విడుదల చేశారు. 78 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6400 కోట్ల జమ చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాట ఇచ్చాననీ, ఆ ఇచ్చిన మాట ప్రకారం అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నానన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాననీ, మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లు అందించామన్నారు.

లంచాలు లేవు.. వివక్ష ఉండదు.. నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామన్నారు సీఎం జగన్. పది రోజుల పాటు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా సొమ్ము అందించే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఆసరా కింద ఇచ్చే డబ్బులు ఎలా వాడుకుంటారో లబ్దిదారుల ఇష్టమని చెప్పారు. మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తొందనీ, వ్యాపార దిగ్గజాలతో ఒప్పందం చేసుకుని వ్యాపార మార్గాలు చూపామన్నారు. ఏపిలోని పొదుపు సంఘాల పని తీరును ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయన్నారు.

చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబందించి సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14 వేల కోట్లు కాగా, ఇవేళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30వేల కోట్లు అందుతున్నాయన్నారు. స్వయం ఉపాధి పొందాలనుకుంటే ప్రభుత్వపరంగా అండదండలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 9 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారని, తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారని అన్నారు. తొలుత వేదిక వద్ద మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించారు. డ్వాక్రా మహిళలతో ముచ్చటించారు.
అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు ఇలా భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వివరించిన సీఎం జగన్