దుష్టచతుష్టయానికి సవాల్ విసురుతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే వారు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఈ తేడేళ్లు ఏకమవుతున్నాయని అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. అర్హత లేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. మనది డీబీటీ ప్రభుత్వం వాళ్లది డీపీటీ అని విమర్శించారు. మన ప్రభుత్వంలో డీబీటీ .. డైరెక్ట్ బెన్ ఫిట్ ట్రాన్స్ ఫర్ అయితే గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో.. తినుకో అంటూ దుయ్యబట్టారు. రాజకీయ విలువలు లేని దుష్టచతుష్టయంతో తాను పోరాడుతున్నానని అన్నారు. ఎన్నికల బరిలో ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారని నిలదీశారు.

తాను ఎవరి మీద ఆధారపడననీ, దేవుడు, ప్రజల మీదనే ఆధారపడతాననీ తెలిపారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరకు మంచే గెలుస్తుందని అన్నారు. సినిమాల్లో హీరోలే నచ్చుతారు కానీ విలన్ లు కాదని పేర్కొన్నారు. పేదరికం నుండి బయటపడాలంటే అది విద్యతోనే సాద్యం అవుతుందని అన్నారు. పిల్లలకు ఆస్తి మనం ఇచ్చే చదువేనని తెలిపారు. పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామన్నారు. బలహీన వర్గాలు బలపడాలంటే అది విద్యతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువేనని తెలిపారు. తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కళాశాలలో సమస్యలుంటే 1092 కి ఫిర్యాదు చేస్తే తాము మాట్లాడతామని పేర్కొన్నారు. సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి పట్ల స్పందించే హృదయం తనది అని అన్నారు. సామాజిక, మహిళ, రైతులకు న్యాయమని నమ్ముతానని చెప్పారు.
గడప గడపలో సంతోషం చూడాలని ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనసు ఈ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవని అన్నారు. కళాశాల ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత తమదేనన్నారు. గత ప్రభుత్వంలో అరకొర ఫీజులు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదన్నారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.698.68 కోట్లు జమ చేస్తున్నామన్నారు. పూర్తి పీజు రీయింబర్స్ మెంట్ ద్వారా రూ.9947 కోట్లు అందించామని, దీని ద్వార 27 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది జరిగిందన్నారు.
TDP MLC: ముగిసిన డిక్లరేషన్ వివాదం .. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత