AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ కు 20 రంగాల్లో పారిశ్రామిక వేత్తల నుండి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. 20 రంగాల్లో 340 పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయనీ, శుక్రవారం రూ.8.54 లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రం నుండి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని జగన్ చెప్పారు. ఏపిలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయనీ, భౌగోళికంగా పరిశ్రమలకు ఏపి అనుకూలమని తెలిపారు. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం, క్రియాశీలక ప్రభుత్వం ఉందని అన్నారు.

విశాఖ త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతున్నదని, తాను కూడా విశాఖ నుండే పరిపాలన చేయబోతున్నానని త్వరలోనే ఇది సాకారమవుతుందని తెలిపారు. దేశంలో అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉందనీ, ఆరు ఓడ రేవులు రాష్ట్ర మంతటా విస్తరించి ఉన్నాయన్నారు. మరో నాలుగు కొత్త పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములు ఉన్నాయని చెప్పారు. సహజ వనరులతో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని జగన్ అన్నారు. నైపుణ్యం కల్గిన యువతకు ఏపిలో కొదవలేదని పేర్కొన్నారు. పెట్టుబడులకే కాదు పకృతి అందాలకు కూడా విశాఖ నగరం నెలవని జగన్ వ్యాఖ్యానించారు.

దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ భారతదేశానికి ఏపి ఎంతో ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో 5 జీ నెట్ వర్క్ 90 శాతం కవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని గ్రంధి మల్లికార్జునరావు అన్నారు. ఇందుకు అనేక గణాంకాలు ఉదాహరణగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తరహాలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మిస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా లక్ష ఉద్యోగాలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సొంత రాష్ట్రమైన ఏపిలో పరిశ్రమల స్థాపనకు తరలిరావాలని జీఎంఆర్ సైతం పిలుపునిస్తుందని అన్నారు. అపోలో హాస్పటల్స్ వైస్ చైర్ పర్సన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఏపి ప్రభుత్వ కృషి అభినందనీయమన్నారు. ఏపి ప్రభుత్వంతో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కరణకర్త వైఎస్ఆర్ సేవలను ఈ సందర్భంగా ప్రీతారెడ్డి గుర్తు చేశారు.
భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపి అందిస్తొందన్నారు. ఏపిలో వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, వాటిని సమర్ధవంతంగా వాడుకుంటే ఏపిలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధికి ఏపి చేస్తున్న కృషిని ప్రశంసించారు. సియాంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తామని తెలిపారు. ఏపిలో సంక్షేమ పథకాలు అమలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో ఏపి నిపుణుల పాత్ర ఆదర్శనీయమన్నారు. విద్యారంగంలో ఏపి కృషి అమోఘమన్నారు. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోందని అన్నారు.

ఏపికి పారిశ్రామిక వృద్దిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీ బలోపేతం చేస్తామన్నారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గిచండం చాలా ముఖ్యమని అన్నారు. ఏపిలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని తెలిపారు. ఏపిలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20వేల కోట్లు ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. అనంతరం సీఎం జగన్మోహనరెడ్డితో కలిసి నితిన్ గడ్కరీ 150 కి పైగా స్టాల్స్ తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను పరిశీలించారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా మరో మారు రాజధానిపై స్పష్టత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్