శివాజీ సినిమాలో ప్రముఖ హీరో రజనీ కాంత్ కుక్కలే గుంపులుగా వస్తాయ్ .. సింహం సింగిల్ గానే వస్తుందంటూ అన్న డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ఇతర పక్షాలు అన్నీ కలుస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నోటి వెంట రజనీ డైలాగ్ వచ్చింది. తోడేళ్లన్నీ ఒక్కటై వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి డైలాగ్ పేల్చారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షాలు, ఆ పార్టీకి అనుకూల మీడియాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ దుష్ప్రచారం చేశారనీ, కానీ ఇప్పుడు ఏపి దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. దేశంలోనే జీడీపీ డీఎస్ డీపీ (గ్రాస్ స్టేట్ డెమోస్టిక్ ప్రొడక్ట్) ప్రకారం.. ఏపి గ్రోత్ రేట్ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే ఇలాంటి ఫలితం సాధ్యమవుతుందని అన్నారు. గతంలో గజ దొంగల ముఠా ఏపీని దోచేశారని విమర్శించారు. గతంలో సీఎంగా ఓ ముసలాయన (చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవారు, ఆయనతో పాటు ఓ గజ దొంగల ముఠా ఉండేది. వాళ్లు దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఇవ్వలేదన్నారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు (పవన్ కళ్యాణ్) ఏం చేశాడో చూశారు కదా, తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయ.. మీ బిడ్డకు ఎలాంటి పొత్తు లేవు, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే .. సింహంలా ఒక్కడే నడుస్తాడు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డకు ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు అని అన్నారు జగన్.

ఇది పేద వాడికి, పెత్తందారుడికి మధ్య నడుస్తున్న యుద్దంగా పేర్కొన్నారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే.. వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నాయని అన్నారు. గజ దొంగల పాలన కావాలా, లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మీ దీవెనలు బిడ్డపై ఉండాలని కోరుకుంటున్నానని జగన్ చెప్పారు. ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేలా ఆశీర్వదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని వివరించారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం 3,30,145 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్. జగనన్న చేదోడు పథకం కింద ప్రతి ఏటా దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు పది వేల చొప్పున ప్రభుత్వం ఆర్దిక సహాయం అందిస్తొంది.
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీ సర్కార్ కీలక నిర్ణయం