ఏపీ వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో కాలేజీని నిర్మించనున్నారు. అదే విధంగా రూ.470 కోట్లతో నిర్మించే తాండవ – ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధానం ప్రాజెక్టు పనులకు, రూ.16 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీలో రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు టీడీపీ, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీరి అనుకూల మీడియాపై మరో సారి నిప్పులు చెరిగారు.

73 సంవత్సరాల ముసలాయన (చంద్రబాబు) పేరు చెబితే గుర్తుకు వచ్చేది రెండే స్కీమ్ లని అవి ఒకటి వెన్నుపోటు, రెండోది మోసం అని సెటైర్ వేశారు. ఇదే సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటనపైనా విమర్శలు గుప్పించారు. తన పబ్లిసిటీ పిచ్చిలో భాగంగా డ్రోన్ కెమెరాల్లో చిత్రీకరణ కోసం ఎక్కువ జనాలు వచ్చారని చూపించుకునేందుకు ఇరుకు రోడ్లలోకి జనాలను పంపి ఎనిమిది మంది మృతికి కారణమయ్యారని విమర్శించారు. చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదనీ, తక్కువగా వచ్చిన జనాలను ఎక్కువగా చూపేందుకు తంటాలు పడుతున్నారని అన్నారు. అందరినీ మోసం చేసిన చంద్రబాబు సభలకు జనాలు ఎందుకు వస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు డైలాగ్ లకు పవన్ దత్త పుత్రుడు యాక్టింగ్ చేస్తారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శించారు. వాళ్లను చూస్తే ఇదం ఖర్మరా బాబు అని జనాలు అనుకుంటున్నారని అన్నారు. తాను చేసేదే చెబుతాననీ, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటానని జగన్ స్పష్టం చేశారు. జగన్ మా నాయకుడు అని గర్వంగా చెప్పుకునేలా పాలిస్తానని చెప్పారు. గత టీడీపీ హయాంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లో ఎన్ని పెన్షన్లు ఇస్తుంది లెక్కలతో సహా వివరించిన సీఎం జగన్.. ప్రభుత్వం పై తప్పుడు, విషపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో నర్సీపట్నం రూపు రేఖలను మార్చబోతున్నామని,. నేడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
Pele Passed Away: ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత
