వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఇప్పటికే అయిదు సార్లు భేటీ అయ్యారు. మార్చి, మే, జూలై, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జగన్మోహనరెడ్డి సమావేశాలను నిర్వహించి గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇంటింటికి వెళ్లి వారికి ప్రభుత్వం అందిస్తున్న లబ్దిని, మంచిని వివరించాలని సమావేశాల్లో జగన్ చెప్పారు. ఇక చివరి రెండు సమావేశాల్లో బాగా చేయని వారి పేర్లు చదివి వినిపించారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించని వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదంటూ కూడా హెచ్చరించారు. ఇదే క్రమంలో గ్రామాల్లో తక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిధులను సైతం కేటాయించారు.

ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ కొందరు 200 రోజులకుపైగా గ్రామాల్లో తిరిగారు. కొంత మంది వంద రోజులు పూర్తి చేసిన వాళ్లు ఉన్నారు. అయితే 30 నియోజకవర్గాల్లో మాత్రం అక్కడి ఇన్ చార్జిలు, ఎమ్మెల్యేలు 50 రోజులు కూడా కంప్లీట్ చేయలేదుట. ఇంతకు ముందు నిర్వహించిన సమావేశాల్లో గృహ సారధుల నియామకంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు జగన్. ఈ క్రమంలో ఇవేళ మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లతో జగన్మోహనరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వంతో పాటు “మా నమ్మకం నివ్వే జగన్” అనే స్టిక్కర్ లను లబ్దిదారుల ఇళ్లకు అంటించే కార్యక్రమంపై సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ నిర్దేశిత ఫార్మెట్ లో గృహ సారధులుగా నియమితులైన వారి తుది జాబితాను హార్డ్ కాపీ (పెన్ డ్రైవ్ లో) లేదా సాఫ్ట్ కాపీని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటి వరకూ 50 రోజులు కూడా గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించని సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుట. వీళ్లలో కొంత మందిపై ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందని పార్టీ వర్గాలకు అందుతున్న సమాచారం. గత సమావేశంలోనే సీఎం జగన్ ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ హెచ్చరించిన తర్వాత కూడా వీరి పనితీరులో మార్పు రాకపోవడం వల్ల ఈ సమావేశంలో అటువంటి వారిపై సీరియస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొందని సమాచారం. ప్రధానంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల్లో ఎవరెవరు ఏ మేరకు పనులు ప్రారంభించారు అనే దానిపైనా రివ్యూ చేస్తారని అంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఎవరెవరికి సీఎం జగన్ హెచ్చరించారు, తలంటారు అనేది తేలుతుంది.
ఏపి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్