ఏపి సీఎం వైఎస్ జగన్ ఇవేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీని కలవనున్నారు. నిన్న ఢిల్లీ చేరుకున్న జగన్ జన్ పథ్ ఒకటిలో రాత్రి బస చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ 11 గంటలకు ఖరారు అయినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ హుటాహుటిన సీఎం జగన్ హస్తినకు చేరుకోవడం, ప్రధాని మోడీతో భేటీ కానుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ప్రధానితో చర్చించనున్నారని సమాచారం.

ఓ పక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడం, వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డిని పలు మార్లు విచారించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మోరో వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు జారీ కావడం, ఆయన కుమారుడు అదే కేసులో అరెస్టు కావడం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సజావుగా జరగడం లేదని, వ్యక్తి టార్గెట్ గా జరుగుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే సీబీఐ పై ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తు తీరును ఆ పార్టీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు తీరు సక్రమంగా జరిగేలా చూడాలని కూడా జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ ప్రతిపక్షాలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయంటూ అటు ఆప్, ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నా ఏపిలో అధికార వైసీపీ ఆ దిశగా ఇప్పటి వరకూ ఆరోపణలు చేయడం లేదు. అయినప్పటికీ ఆ పార్టీ నేతలను సీబీఐ, ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీకి వైసీపీ అనధికార మిత్రపక్షంగా కొనసాగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి తలనొప్పులు వస్తున్నాయి. ఈ వ్యవహారంతో పాటు ఏపి రాజధాని అంశంపైనా ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది. విశాఖ నుండి పరిపాలన చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ విషయంపై తొలి నుండి తమ స్టాండ్ ను ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు తెలియజేస్తూ వచ్చినా ఇటీవల పార్లమెంట్ లో ఏపి ప్రభుత్వం .. మూడు రాజధానుల అంశానికి సంబంధించి తమకు తెలియజేయలేదని చెప్పడం, అదే విధంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. మూడు రాజధానులపై ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుండి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.
హైదరాబాద్ లో గంటల వ్యవధిలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు