CM YS Jagan: అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని జాహ్నవి కందుల మృతి పై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. అమెరికాలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీ సీటెల్ లో ఇన్ప్ ర్మేషన్ సిస్టమ్స్ లో మాస్టర్స్ చేస్తూ ప్రమాదానికి గురైన జాహ్నవి మృతి చెందిన ఘటనపై అపహాస్యం చేసిన సీటెల్ దర్యాప్తు అధికారి అమానవీయ ప్రవర్తన ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని సీఎం జగన్ కోరారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల ఈ ఏడాది ఫిబ్రవరి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ఆమె మృతి చెందింది. అయితే జాహ్నవి మృతికి ఆనాడు సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే జాహ్నవి మృతి పట్ల అక్కడి పోలీస్ అధికారి .. చులకన భావంతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టారు.
జాహ్నవి రోడ్డు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి అక్కడకు వెళ్లిన పోలీస్ అధికారి డానియెల్ అడరన్ .. పై అధికారికి కేసు వివరాలు చెబుతూ వెకిలిగా ప్రవర్తించారు. పకపకా నవ్వుతూ..” ఆమె చనిపోయింది. నార్మల్ పర్సనే. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో, ఓ 11వేల డాలర్లకు చెక్ ఇస్తే సరిపోతుంది. విలువ తక్కువే” అంటూ వెకిలిగా మాట్లాడాడు. ఈ సంభాషణ అతని బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. సోమవారం సియాటెల్ పోలీసులు ఈ క్లిప్ ను బయటకు రిలీజ్ చేశారు. దీనిపై సీయాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషనర్ సీరియస్ గా స్పందించి విచారణకు జరుపుతున్నారు.
తాజాగా ఇవేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మన అమ్మాయి చనిపోతే .. ఆమె జీవితాన్ని తక్కువగా చేసి మాట్లాడటం తనను చాలా బాధ కల్గించిందని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి జాహ్నవి మృతి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు సీఎం జగన్. ఓ నాన్ అమెరికన్, అందులో ఓ అమాయక విద్యార్థి మృతి పట్ల ఆ ఆఫీసర్ అమానవీయ ధోరణినిగా ప్రవర్తించడాన్ని అందరూ ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం తరపున ప్రయత్నాలు ఉండాలని అన్నారు. ఈ చర్యలు అమెరికాలో ఉన్న భారతీయుల ధైర్యం పెంపొందించేలా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంలో ఎస్ జైశంకర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని, జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్ లేఖలో కోరారు.
అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కు లేఖ రాసిన సీఎం శ్రీ వైఎస్ జగన్. 1/2 pic.twitter.com/TQPLb3uRxA
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 14, 2023