ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 21వ తేదీన వెళ్లాల్సిన లండన్ పర్యటన రద్దు అయ్యింది. లండన్ లో విద్యాభ్యాసం చేస్తున్న తమ కుమార్తెతో ఏటా జగన్ దంపతులు గడపడం ఆనవాయితీగా వస్తొంది. ప్రతిపక్ష నేతగానూ.. ఆ తర్వాత సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జగన్ దంపతులు ప్రతి ఏటా లండన్ వెళ్లి కుమార్తెతో వేసవి సెలవుల్లో గడుపుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఈ ఏడాది కూడా లండన్ వెళ్లేందుకు జగన్, భారతి దంపతులు సిద్దమయ్యారు. గన్నవరం నుండి ముంబాయికి ప్రత్యేక ఫ్లైట్ లో చేరుకుని అక్కడ నుండి రెగ్యులర్ విమానంలో లండన్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

అయితే అకస్మాత్తుగా తమ లండన్ పర్యటను జగన్ దంపతులు వాయిదా వేసుకున్నారు. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ చిన్నాన్న, భారతి రెడ్డి మేనమామ అయిన వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం, భాస్కరరెడ్డి తనయుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి విచారణకు హజరు కావాలంటూ మరో సారి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాల కారణంగా జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారంటూ పలు మీడియాల్లో కథనాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి తన విదేశీ పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు అనే విషయంపై ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు కేంద్ర కార్యదర్శుల సమావేశానికి బుధవారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఢిల్లీ పర్యటనకు రావాలని సీఎం జగన్ ను కూడా కోరామని చెప్పారు. అందుకే వ్యక్తిగత పర్యటన వాయిదాకు సీఎం అంగీకరించారని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. తామంతా బుధవారం (నేడు) ఢిల్లీ వెళుతున్నామని, అవసరమైతే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వస్తారని తెలిపారు. తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక సమస్యలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్ అనేక మార్లు కలిసి కోరారన్నారు. ఇటీవల జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఆర్ధిక శాఖ సూచనల మేరకు నిధుల లేమి కారణంగా వాయిదా వేశామని వెల్లడించారు.
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్