AP Employees JAC: ఏపి ప్రభుత్వం విడుదల చేసిన రివర్స్ పీఆర్సీ జీవోపై ఐక్యంగా ఉద్యమించాలని డిసైడ్ అయిన ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చాయి. వివిధ ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సదరు ఉద్యోగ సంఘాలు మీడియాకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకూ చెప్పాయి. ఇదే క్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు పెద్ద బాంబే పేల్చాయి ఉద్యోగ సంఘాలు. తమ పిఆర్సీ సాధన ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని తేల్చి చెప్పాయి.

Read More: Gudivada: గుడివాడ క్యాసినో కేసులో దిమ్మతిరగే ట్విస్ట్ ; కొడాలి నాని మామూలోడు కాదు బాబోయ్..!
AP Employees JAC: రాజకీయ పార్టీల నేతలు తమ ఉద్యమంలో పాల్గొనవద్దు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్దమైనప్పటి నుండి రాజకీయ పార్టీలన్నీ జోక్యం చేసుకున్నాయి. జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఉద్యోగ సంఘాలకు మద్దతు ప్రకటించాయి. అధికారంలో ఉన్నప్పుడు సంఘాలే ఉండకూడదని హెచ్చరికలు చేసిన చంద్రబాబు సైతం ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ తరుణంలోనే ఉద్యోగులు ప్రతిపక్షాల మాయలో పడవద్దనీ వాస్తవాలు గ్రహించాలని మంత్రులు సూచిస్తున్నారు. ప్రతిపక్షాలు సపోర్టు చేస్తున్నాయంటే వారే తెరవెనుక ఉండి ఉద్యోగుల ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ప్రభుత్వం భావిస్తే తమకు నష్టం జరుగుతుందని భావించారో లేక మరే కారణాల వల్లో కానీ ఉద్యోగ సంఘాల నేతలు కరాఖండిగా రాజకీయ పార్టీల నేతలు తమ ఉద్యమంలో పాల్గొనవద్దని చెప్పేశారు. ఇలా ఉద్యోగ సంఘాలు స్టేట్ మెంట్ ఇస్తారని ఊహించని రాజకీయ పార్టీలు ఖంగుతిన్నాయి.
ముఖ్యమంత్రిపైనా విమర్శలు చేయవద్దు
ఇదే క్రమంలో ఉద్యోగులు ఎవ్వరూ కూడా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా విమర్శలు చేయవద్దని పీఆర్సీ సాధన సమితి నేతలు సూచించారు. కొందరు ఉపాధ్యాయులు జగన్ పైనా, ప్రభుత్వంపైనా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారనీ, ఇలా మాట్లాడే మాటలే ఉద్యమానికి చేటు తెస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు గ్రహించారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడి ఉద్యోగులు ఎవరూ వ్యక్తిగతంగా దూషణలు చేయవద్దని చెబుతున్నారు. ఈ పరిణామంతో ఉద్యోగుల సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న రాజకీయ పక్షాలకు బిగ్ షాక్ ఇచ్చినట్లు అయ్యింది.