ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మొన్న జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై సీఎం జగన్ ను దుశ్సాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు సీఎం జగన్ అండగా ఉంటానని స్పష్టం చేశారని తెలిపారు. ఉద్యోగులకు ఎంతవీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దమనీ, జీపీఎస్ కోసం రెండేళ్లుగా కసరత్తు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములనీ, వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారని అన్నారు సీఎం జగన్.

ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 12వ పీఆర్సీ ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను ప్రకటించారని చెప్పారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగస్వాములేనని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. చాలా వరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారని తెలిపారు. 16 శాతం హెచ్ఆర్ఏ ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు. ఏపీ ఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ .. టీడీపీ హయాంలో పీఆర్సీ కమిషన్ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు.

సీఎం జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించిందన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్లే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవని కొనియాడారు. ఇటీవల కాలం వరకూ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారంటూ విపక్షాలు ప్రచారం చేశాయి. అయితే కేబినెట్ లో తీసుకున్న తాజా నిర్ణయాలతో ఇటీవల కాలం వరకూ ఉద్యోగుల సమస్యలపై ఆందోళన బాట పట్టిన కొన్ని సంఘాల నేతలు సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడంతో ఆ వర్గాల్లో వ్యతిరేకత కొంత వరకూ తగ్గినట్లు అయ్యింది.