తమ డిమాండ్ ల సాధనకు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దపడుతున్న వేళ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా బకాయిలు అన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపి ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదనీ, అందుకే ఉద్యోగులకు చెల్లించలేకపోయామని వివరణ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై రెండు మెట్లు దిగే చర్చలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యోగులకు ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతూనే ఉంటుందని చెప్పారు. చిన్న చిన్న సమస్యలను ఉద్యోగులు – ప్రభుత్వం కలిసి పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన చర్చల్లో కొన్ని అంశాలు పరిష్కారం అయ్యాయనీ, మరికొన్ని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి వెల్లడించారు. వారి పెండింగ్ అంశాలను తెలుసుకునేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం అయినట్లు తెలిపారు. పీఎఫ్ పెండింగ్ బిల్లులు అన్నీ ఈ నెలాఖరులోగా క్లీయర్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై సంతృప్తి కలిగేలా నిర్ణయం ఉంటుందన్నారు. శాశ్వత విత్ డ్రా, తాత్కాలిక పీఎఫ్ రుణాల బిల్లులనీన చెల్లించనున్నట్లు తెలిపారు.
మెడికల్, ఈ హెచ్ ఎస్ బిల్లులన్నీ ఈ నెలలోనే బేషరతుగా చెల్లిస్తామని చెప్పారు. టీఏ, జీఎల్ఇ బిల్లులనూ ఈ నెలలోనే చెల్లిస్తామని తెలిపారు. ఇకపై మంత్రుల కమిటీ తరచుగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. అయితే సమావేశం అనంతరం ఏపీ జేఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ ఉద్యోగ కార్యచరణ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. త్వరలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించి ఉద్యమ కార్యచరణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Political Survey: బాబు ఇలాకాలో జగన్ హవా .. తాజాగా వచ్చిన సర్వేలోనూ అదే లెక్క..!