జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి పడాల అరుణ ఇవేళ పార్టీలో చేరారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ దసపల్లా హోటల్ కు చేరుకున్నారు. హోటల్ లో జరిగిన కార్యక్రమంలో విజయనగరం జిల్లా గజపతినగరం కు చెందిన మాజీ మంత్రి పడాల అరుణకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్దాంతాలు నచ్చి ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

పడాల అరుణ గజపతి నగరం నుండి మూడు సార్లు (1989, 1994, 2004) టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో అరుణ ఓటమి పాలైయ్యారు. రెండేళ్ల క్రితం పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదన్న అసమ్మతితో అరుణ టీడీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గజపతినగరంలోని జనసేన పార్టీ శ్రేణులు ఆమెను ఆహ్వానించగా, కొద్ది రోజుల క్రితం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో అరుణ భేటీ అయ్యారు.
పార్టీలో చేరికపై నిర్ణయాన్ని తీసుకున్నారు పడాల అరుణ. రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం అని భావించి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు అరుణ తెలిపారు. యువతకు మేలు చేసే పవన్ ఆలోచనలు, నిర్ణయాలు తనకు నచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
పీఎఫ్ఐ కీలక నేత నివాసంలో ఎన్ఐఏ సోదాలు