జగన్ సర్కార్ 24 రోజుల లోనే కట్టించిన తొలి ఇల్లు ఇదే..!!

రాష్ట్రంలో పేద వర్గాలందరికీ సొంతింటి కల సాకారం చేయాలన్న మంచి లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలోనే అర్హులందరికీ ఇళ్లు స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని మానిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇళ్ల స్థలాల పంపిణీకి గానూ భూములను సేకరించడంతో పాటు లే అవుట్లను సిద్ధం చేయడం, లబ్దిదారుల ఎంపికనూ పూర్తి చేశారు. అయితే గత ఏడాది మొదట్లోనే స్థానిక ఎన్నికల నోటిఫికేష్ విడుదల కావడం, దానికి తోడు పలు ప్రాంతాల్లో సేకరించిన భూములపై వివాదాలు, కోర్టుల్లో కేసులు వేయడంతో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది.

 

ఆ తరువత కరోనా లాక్ డౌన్ తో పలు మార్లు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు కోర్టు వివాదాలు లేని భూములను ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చి గత నెల 25వ తేదీ నుండి సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలలో గృహ నిర్మాణాలకు మూడు కేటగిరిలుగా నిర్ణయించారు. స్థలాల పంపిణీ పూర్తి కావడంతో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు మరి కొంత నగదును లబ్దిదారుడు వేసుకుని సొంతంగా నిర్మించుకునే వారి జాబితాను సిద్ధం చేశారు.

గుంటూరు జిల్లాలో తొలి ఇంటి నిర్మాణం

ఇళ్ల నిర్మాణాల్లో రెండవ కేటగిరి కింద గృహ నిర్మాణ సంస్థ లబ్దిదారుడికి లక్షా 80వేలు అందిస్తుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి లబ్దిదారుడే సమకూర్చుకోవాలి. ఈ క్యాటగిరి కింద ఇల్లు మంజూరైన ఓ లబ్దిదారురాలు కేవలం 24 రోజుల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని తన సొంతింటి కల నిజం చేసుకున్నది.  గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో రత్నకుమారి అనే మహిళకు గత నెల 25వ తేదీన ఇంటి పట్టా అందజేయగా వెంటనే ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం మంజూరు చేసిన లక్షా 80వేలకు తోడు మరో లక్షా 20వేలు సొంత నిధులు ఖర్చు చేసి 24 రోజుల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసింది.

ఈ గృహాన్ని నరసారావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబులు ఆదివారం ప్రారంభించారు. రెండవ కేటగిరి కింద రాష్ట్రంలోనే మొదటిగా రత్నకుమారి ఇల్లు నిర్మించుకున్నారని గృహ నిర్మాణ శాఖ ఏఇ ఆర్ వి సుబ్బారావు తెలిపారు. కేవలం 24 రోజుల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన రత్నకుమారి ఇతర లబ్దిదారులకు ఆదర్శవంతంగా నిలుస్తోంది. తమ సొంతింటి కల నెరవేరినందుకు లబ్దిదారురాలు రత్నకుమారి సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, స్థానిక ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు ధన్యవాదాలు తెలియజేసింది.