ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు అంగీకరించిన సీఎం జగన్ .. తాజాగా క్రమబద్దీకరణకు అయిదేళ్ల నిబంధనను తొలగించనున్నారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయనుంది. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వివిధ డిపార్ట్ మెంట్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్దీకరణ కై ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.

మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. క్రమబద్దీకరణకు సంబంధించి కొద్ది రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. వీలైనంత ఎక్కువ మంది రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని, సీఎం నిర్ణయంతో అదనంగా మరో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ది కలుగుతుందని ఏపీజీఈఏ చైర్మన్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికే విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం జగన్ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపిలో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం, ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 27 మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా జీతాల పెంపుతో ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అంతే కాకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కాంట్రాక్ట్ ఏజన్సీలకు ప్రభుత్వం ఆదేశించింది.