AP High Court: అమరావతి ప్రాంతంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 45 ను సవాల్ చేస్తూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు దేవదత్త కామత్, ఆంజనేయులు, ఉన్నం మురళిధర్ బలంగా వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకమని వాదించారు. రాజధాని భూములను వేరే అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ..ప్రభుత్వం జారీ చేసిన జీవో పై మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయసమ్మతం కాదని న్యాయవాదులు తెలిపారు. ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు విచారణ లో ఉందని తెలియజేయగా, అక్కడికే వెళ్లవచ్చుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని అందరిదీ అని అందులో అందరూ ఉండాలని సీజే వ్యాఖ్యానించారు. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడం లేదని రాజధాని భూములు విషయంలో మాత్రమే తాము వాదనలు వినిపిస్తున్నామని న్యాయవాదులు చెప్పారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపి ప్రభుత్వం, సీఆర్డీఏ కు నోటీసులు ఇచ్చి కౌంటర్ లు దాఖలు చేయాలని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినేందుకు ఈ నెల 19వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.
సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్ లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న నెంబర్ 45 జివోను విడుదల చేసింది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
నేడు రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ కీలక సమావేశం