Chandrababu Arrest: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్ధ్ అగర్వాల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును బాధ్యుడ్ని చేయడం సరికాదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని ధర్మాసనానికి వివరించారు. రెండేళ్ల క్రితం కేసు పెట్టి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదనీ, హఠాత్తుగా ఆయన పేరు చేర్చారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
ప్రాధమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరనడం సరికాదని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చంద్రబాబు ప్రమేయాన్ని గుర్తించి ఆయన పేరును చేర్చామని న్యాయస్థానానికి వివరించారు. టెరాసాఫ్ట్ పనులు ఇవ్వడం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. కావున చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు అంటూ న్యాయస్థానాన్ని కోరారు.

ఈ పిటిషన్ పై బుధవారం కూడా వాదనలు జరిగాయి. పూర్తి స్థాయిలో వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సిద్ధార్ధ అగర్వాల్ నిన్న వాదనలు వినిపిస్తూ టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు విషయంలో సాంకేతిక కమిటీ, టెండర్ అవార్డు కమిటీలో చంద్రబాబు సభ్యుడిగా లేరన్నారు. విధానపరమైన నిర్ణయాల అమలు విషయంలో కొందరు చేసిన తప్పులకు, ఆర్ధిక అక్రమాలకు, చోటు చేసుకున్న లోపాలకు అప్పటి ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. రాజకీయంగా బలమైన ప్రత్యర్ధిగా ఉన్న పిటిషనర్ ను జైలులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తొందని అన్నారు. ఈ నేపథ్యంలోనే దురుద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారని ఆయన వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో ధర్మాసనం తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది.
Nandamuri Balakrishna: తెలంగాణలో ఫోకస్ పెంచిన టీడీపీ .. కీలక వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ