RRR: త్వరలో విడుదల కానున్న భారీ బడ్జెట్ మువీ ఆర్ఆర్ఆర్ కు అందరూ ఊహించినట్లుగానే ఏపి సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. పది రోజుల పాటు సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు రోజుకు అయిదు షోలకు అనుమతి వచ్చేస్తోంది. దీనిపై ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. హీరో, హీరోయిన్, దర్శకుల రెమ్యూనరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ మువీ నిర్మాణతలు ధరఖాస్తు చేశారన్నారు. రెమ్యునరేషన్లు కాకుండా రూ.336 కోట్లు ఖర్చు అయినట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ధరఖాస్తులో పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు.
RRR: జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు
ఆర్ఆర్ఆర్ టీమ్ ధరఖాస్తును కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని మంత్రి వెల్లడించారు. మొదటి పది రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇకపై నిర్మాణాలు చేసే సినిమాలకు 20 శాతం ఏపిలో షూటింగ్ లు జరగాలన్నారు. ఏపిలో షూటింగ్ ల నిర్వహణకు ఇతర రాష్ట్రాల మారిదిగా ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే సింగిల్ విండో విధానంలో ఉచితంగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి టెండర్లు ఖరారు అయ్యాయనీ, త్వరలోనే ఈ విధానం అమలులోకి వస్తుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.