AP News: ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత పాఠశాలలకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాధమిక పాఠశాలల విలీనం చేసేందుకు మ్యాపింగ్ సిద్దమైన సంగతి సంగతి తెలిసిందే. నెల రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ తుది దశకు వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మ్యాపింగ్ పై అవగాహన కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు వెలగపూడి సచివాలయంలో జరిగే వర్క్ షాపు నేడు ప్రారంభం అయ్యింది. అయితే నూతన విద్యా విధానంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, షేక్ సాబ్జి, రఘువర్మ లు బహిష్కరించారు.

స్కూల్స్ విలీనంకు వ్యతిరేకంగా పోరాటం
రాష్ట్రంలోని 35 వేల స్కూళ్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసే ఆలోచన చేస్తోందని వీరు ఆరోపించారు. కేవలం ఎకానమీ కోసమే స్కూళ్ల విలీనంను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని వారు అన్నారు. నూతన విద్యా విద్యావిధానంలో లేని వాటిని కూడా ఇక్కడ అమల చేస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా తాము పోరాడుతామని పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా 2023- 24 నాటికి రాష్ట్రంలోని 25,396 ప్రాధమిక పాఠశాలలను అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. తొలి దశలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే 2,663 పాఠశాలలను విలీనం చేశారు.
మారుతున్న పాఠశాలల వర్గీకరణ
ఇకపై పాఠశాలల వర్గీకరణ కూడా మారుతోంది. అంగన్ వాడీ కేంద్రాలను శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చి ప్రీ ప్రైమరీ(పీపీ)1, ప్రీ ప్రైమరీ 2 భోధిస్తారు. ఫౌండేషన్ స్కూళ్లలో పీపీ1, పిపి 2, ఒకటో తరగతి, రెండో తరగతి ఉంటాయి. ఫౌండేషన్ ప్లస్ స్కూల్ అంటే పిపి 1 నుండి 5వ తరగతి వరకూ ఉంటాయి. ప్రీ హైస్కూల్ అంటే 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉంటాయి. ఉన్నత పాఠశాలలు 3వ తరగతి నుండి పదవ తరగతి వరకు. హైస్కూల్ ప్లస్ 3 నుండి 12వ తరగతి వరకూ ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాధమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూళ్ల తరగతులను నిర్వహిస్తారు.