రాష్ట్రంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనలకు స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టే వారికి చేదోడుగా నిలవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా పరిశ్రమల నిర్మాణాలు పూర్తి అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలని తెలిపారు.

రానున్న ప్రతి పరిశ్రమలోనూ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని సీఎం జగన్ మరో సారి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ప్రాజెకటుల విధానంలో కీలక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. పవర్ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పరిస్థితులు తీసుకువచ్చామని తెలిపారు. తీసుకున్న భూమికి ఎకరాకు రూ.31వేల లీజు కింద చెల్లింపులు వచ్చాయన్నారు.
ఈ సమావేశంలో కృష్ణా జిల్లా మల్లవల్లి పార్క్ లో ఇథనాల్ ఇంథన తయారీ చేసే ఆవిశా ఫుడ్స్ మరియు ఫ్యూయెల్స్ కంపెనీ, కడియం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్, శ్రీకాళహస్తి, పుంగనూరు ల్లో ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు, రామాయపట్నం లో ఆకార్డ్ గ్రూపు ఫ్యాక్టరీ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులు, విశాఖపట్నంలోని కాపులుప్పాడు లో మరో వంద మెగావాట్ల డేటా సెంటర్, వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలు, భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.