AP YCP Politics: కేసిఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారా..! రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు జగన్ వ్యూహ రచన..!?

Share

AP YCP Politics:  ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. కానీ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్లుగా ఏదోఒక కార్యక్రమంతో జనాల్లోకి వస్తున్నారు. ఈ పరిణామాల అన్నీ ముందస్తు వ్యూహం కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి యోచన చేస్తున్నారా అంటే విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. రెండున్నరేళ్ల వైఎస్ జగన్ పాలన సాఫీగా జరిగిపోయినా ఇప్పుడిప్పుడే సమస్యలు కనిపిస్తున్నాయని భావిస్తోంది. ప్రతిపక్షాలు సిద్ధంగా లేనప్పుడే ఎన్నికలకు వెళ్లాలని యోచన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇంతకు తెలంగాణలోనూ సీఎం కేసిఆర్ ప్రతిపక్షాలు సిద్ధం లేని సమయంలో ముందస్తు వ్యూహానికి వెళ్లి సక్సెస్ అయ్యారు. ఆ ఫార్మలానే జగన్ కూడా అనుసరించవచ్చనే వాదన వినబడుతోంది. వైసీపీ స్థాపించిన తరువాత తిరుగులేదని ఆధిక్యతతో వైెఎస్ జగన్మోహనరెడ్డి సీఎం అయ్యారు. వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు రావడంతో ప్రతిపక్షాలు పూర్తిగా ఖంగుతిన్నాయి. ఇంత ఘోరమైన అపజయాన్ని టీడీపీ జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ క్లీన్ స్పీప్ చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ ఇవ్వడం అటుంచి అభ్యర్ధులను నిలబెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇటీవల జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో మాత్రం జనం మూడ్ మారుతోందన్న సంకేతాలు వచ్చాయని అంటున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కైవశం చేసుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలు చూస్తే గతంలో మాదిరి మరీ ఏకపక్షంగా లేవని అంటున్నారు. కేవలం సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలుపు ఇవ్వలేదన్న నిజం వైసీపీకి అర్ధం అయ్యిందనే వాదన మొదలైంది. తెలంగాణ హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసిఆర్ ప్రతిష్టాత్మంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టినా ఓట్లు రాల్లేదు. దీంతో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి ఉపయోగపడవని అర్ధం అయి పోయింది.

AP YCP Politics:  ఏపికి ఆర్ధిక సవాళ్లు

జగన్ కు రెండున్నరేళ్ల పాలన సాఫీగానే సాగింది. నవరత్నాలు అమలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వైసీపీ చెబుతోంది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనీ, కరోనా కాలంలోనూ పేదలకు నగదు బదిలీ చేశామని పేర్కొంటున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఏపికి ఆర్ధిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్ లకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. అటు పార్లమెంట్ లో కేంద్రం కూడా ఏపి పెద్ద మొత్తంలో అప్పులు చేస్తోందని చెప్పకనే చెప్పింది, ఇప్పటికే పథకాల పేరుతో అభివృద్ధిని పక్కన పడేశాయని ప్రతిపక్షాలు మరో పక్క విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీస్తున్నాయంటూ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఇప్పటి వరకూ ఆర్ధిక పరిస్థితిపై ధీటుగా జవాబు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతోంది. ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలతో కాలం గడిచిపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపికి ప్రత్యేక హోదా వంటి సమస్యలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. తిరుగులేని మెజార్టీ వచ్చినా కేంద్రం నుండి ఏమి సాధించారని ఇప్పటికే ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాడకపోగా ఇచ్చేదాక అడుగుతూ ఉంటామని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మేధావులు విమర్శిస్తున్నారు. ఇక అప్పులు చేయడంలో సరికొత్త విధానాలు తెరలేపారనీ విమర్శలు వస్తున్నాయి. ఇక రాజధాని విషయంలోనూ అడుగు ముందుకు పడలేదు. మూడు రాజధానుల పేరుతో హడావుడి చేసినా మళ్లీ వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకున్నారు. మరింత మెరుగైన బిల్లు తీసుకువస్తామని అసెంబ్లీల సీఎం వైెఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు అవుతున్నా ఏపికి రాజధాని ఏదో క్లారిటీ గా చెప్పలేని దుస్థితి దాపురించింది.

AP YCP Politics: కనీసం ఆరు నెలల నుండి 9 నెలల వరకూ ముందస్తుకు

ఏపిలో అవినీతి కూడా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత, జిల్లా స్థాయి అధికారుల మీటింగ్ లలో చెప్పినా కింది స్థాయి లో జరగాల్సినవి జరుగుతూనే ఉందని అంటున్నాయి, మరో పక్క ప్రభుత్వం ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేక పోగొట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల పీఆర్సీ పై సీఎం దృష్టి సారించారు. ఎంత పిఆర్సీ ప్రకటిస్తారు అన్నది అసక్తికరంగా ఉంది. మరో ఏడాది కాలంలో అసంతృప్తి వర్గాలను మళ్లీ పార్టీ వైపుకు వచ్చేలా చేసుకుని ముందస్తుకు వెళితే ప్రతిపక్షాలను కన్ఫూజ్ చేయవచ్చనే వాదన కూడా ఉంది. షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరిగితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అప్పుడు ప్రతిపక్షాలకు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముందస్తుకు వెళితే ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ పోతుందని భావిస్తున్నారు. కనీసం ఆరు నెలల నుండి 9 నెలల వరకూ ముందస్తుకు జగన్ వెళతారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఎటువంటి సంకేతాలు లేవు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ముందస్తు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్న పేరు ఉందనీ, ముందస్తు వస్తే కలిసి వస్తుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలు ప్రస్థావించి జగన్ మరో సారి ఇరుకున పెట్టవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. జగన్ షెడ్యుల్ ప్రకారం ఎన్నికలకు వెళతారా లేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆరు నెలల ముందు అంటారా తేలాలి.


Share

Related posts

బీజేపీలో “కమ్మ- కాపు” సాధ్యమేనా.? “కమ్మ” రాజకీయం కొత్త ఎత్తులు..!

Srinivas Manem

Noel Sean : నోయెల్ సేన్ కొత్త ఆల్బమ్ సాంగ్ చూస్తే ఏడ్చేస్తారు?

Varun G

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గోపూజ మహోత్సవాలు.. సంబరాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

somaraju sharma