APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గురువారం సాయంత్రం ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. గ్రూప్ – 1 లో ఖాళీల 110 పోస్టులకు గానూ తుది ఫలితాలను ఆయన ప్రకటించారు. నోటిఫికేషన్ నుండి ఫలితాలు వెల్లడి వరకూ పూర్తి పారదర్శకత పాటించామనీ, అతి తక్కువ సమయంలో వివాదాలకు దూరంగా ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. మొదటి సారిగా సీసీ కెమెరాలను వినియోగించినట్లు చెప్పారు.

111 పోస్టులకు 110 పోస్టుల ఫలితాలు ప్రకటించడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరగనుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్దులను ఎంపిక చేశామన్నారు. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామనీ, ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలి సారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక పూర్తి కావడం ఇదేనన్నారు. ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకు వచ్చిన వారిలో ఉన్నారన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్థానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
గ్రూప్ – 1 టాప్ 5 ర్యాంకర్లు వీరే
- మొదటి ర్యాంక్ – భానుశ్రీ లక్ష్మి అన్నపూర్ణ ప్రతూష
- రెండో ర్యాంక్ – భూమిరెడ్డి భవాని
- మూడో ర్యాంక్ – కుంబాలకుంట లక్ష్మీ ప్రసన్న
- నాలుగో ర్యాంక్ – ప్రవీణ్ కుమార్ రెడ్డి
- అయిదో ర్యాంక్ – భాను ప్రకాష్ రెడ్డి