ఏపిఎస్ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏపిఎస్ ఆర్ టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2023 పేరుతో వాట్సాప్ లో ఓ వార్త మంగళవారం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తొంది. త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయనీ, ముందుగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని దానికి కొంత మొత్తం చెల్లించాలని తెలుపుతూ వాట్సాప్ లో చాలా మందికి సందేశాలు అందుతున్నాయి. ఈ వార్త తెలియడంతో ఆర్టీసీ స్పందించింది. ఈ ప్రచారాన్ని ఏపిఎస్ ఆర్ టీసీ ఖండించింది. తాము ఎటువంటి నోటిఫికేష్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

గతంలోనూ ఇలాగే కొందరు ఫేక్ మెయిల్స్ ద్వారా చాలా మందిని మోసం చేసే చర్యలకు పాల్పడ్డారనీ, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా సులభంగా ఇటువంటి తప్పుడు వార్తలను వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతున్నారని ఆర్టీసీ తెలియజేసింది. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ కోరింది. ఆర్టీసీ లో ఉద్యోగాల భర్తీ ఉంటే ఆర్టీసీ అధికారులే మీడియా ద్వారా గానీ పత్రికల ద్వారా గానీ ఆ విషయాన్ని అందరికీ తెలియజేసి అధికారికంగా ప్రకటిస్తారని పేర్కొన్నారు. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.